రోజు లానే భయంకరమయిన లంచ్ చేసి కాసేపు కునుకు తీసి ఇక పని మొదలెడదాం అని పాడు ఆలోచన చేస్తుండగా టైం కాని టైం లో మెయిల్ వచ్చింది. అదేంటో లంచ్ తర్వాత పీకలమునిగే ఇష్యూ వచ్చిన టీ తాగి వచకే మెయిల్ చేస్తారు. కాని ఆ టైంలో మెయిల్ చూడగానే అర్ధం అయ్యింది మనకి ఏదో బాడ్ టైం మొదలయ్యింది అని. ఈ శనివారం టీం ఔటింగ్ వుంది, వచేవాళ్ళు 'ఎస్' నొక్కండి రాని వాళ్లు 'నో' నొక్కండి. వెంటనే 'ఎస్' అని నొక్కేసి తీరిగ్గా బాధపడటం మొదలెట్టా. టీం ఔటింగ్ అంటే అందరు కలిసి మార్నింగ్ నుండి ఈవెనింగ్ దాక ఎంజాయ్ చెయ్యటం అనే అనుకునే వాడిని. కాని కొందరు ఎంజాయ్ చేస్తుంటే మిగతా అందరు వాళ్ళని భరించటం అని ఇప్పుడు చేస్తున్న కంపెనీ లో చేరాకే అర్ధం అయ్యింది. లాస్ట్ ౩ ఔటింగ్స్ లో జనాలని నరకపు అంచుల దాక తీసుకెళ్ళి ఆ తర్వాత గుడ్ జాబ్ , గ్రేట్ జాబ్ , గ్రేటెస్ట్ జాబ్ అని మెయిల్స్ కొట్టుకోవటం మాకే చెల్లుతుంది. అయిన వెళ్తున్నాం అంటే రెండు కారణాలు ఒకటి మండే ఆఫీసు కి వెళ్ళాక ఇక మనకి ఇంకో నరకం చూపిస్తారు. సోమవారం నుండి నాలుగు రోజులు ఏమి జరిగిందో ఎలా జరిగిందో చెవుల్లో రక్తం వచ్చేలాగ చెబుతారు. శుక్రవారం ఎలాగు వీకెండ్ మూడ్ లో దీన్ని వదిలేస్తారు. ఇంకోటి ఔటింగ్ వచ్చిన వారికి గిఫ్ట్ ఒకటి ఇస్తారు. అది కచితంగా మా అమ్మ కో బామ్మ కో ఉపయోగ పడుతుంది. అది తీసుకెళ్ళి ఇంటికాడ ఇస్తే ఒక వారం మా అమ్మ మా వాడు కత్తి, కేక అని వూరు మొత్తం ప్రచారం చేస్తాది.
మిగతా ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసి ఈ సారి ఔటింగ్ లో ఫ్యాషన్ షో వుంటది అని తెలుసుకుని, సిటీ లోనే మంచి పేరున్న అయిదు నక్షత్రాల హోటల్ అని, ఆ రోజు ఔటింగ్ అవ్వగానే అక్కడే ఎవడో ఒకడి జేబుకు బాగా చిల్లు పెడదాం అని ఇంకా చాల చాలా రకాలుగా అనుకుని చివరికి వెళ్ళాలనే నిర్ణయించుకున్నా.
చివరికి ఆ దుర్దినం రా నే వచ్చింది. చక్కగా రెడీ అయ్యి భయలుదేరుతుండగా రూమ్మేట్ 'ఇదిగో వుంచుకో' అని అయిదు వేలు చేతిలో పెట్టాడు. ఎన్దుకురా అన్నా నేను. అయిదు నక్షత్రాల హోటల్ కి వెళ్తున్నావ్ జేబు లో అయిదు వేలు లేకపోతే ఎలా అని నవ్వాడు. నాకు వెంటనే ఎడం కన్ను అదిరింది కాని మొదటి ప్రోగ్రాం ఫ్యాషన్ షో అన్నది గుర్తోచి ఏమి మాట్లాడకుండా భయలుదేరా. కిందకి వెళ్లి బండి స్టార్ట్ చెయ్యగానే ఒక మెసేజ్ వెంటనే ఇంకో కాల్ వచ్చింది. ఎవరా అని చూస్తే నా రూమ్మేట్
వాడు : ఇందాక ఇచిన అయిదు వేలు దారిలో ఆ దివాలా బ్యాంకు లో వెయ్యి.
నేను : రేపు వేస్తా
వాడు : రేపు దివాలా బ్యాంకు మన దగ్గరి బ్రాంచ్ వుండదు
నేను : వెయ్యక పోతే
వాడు : నాన్నా నీ బండి కి పేపర్స్ లేవు, నీకు లైసెన్స్ లేదు, చెన్నై ట్రాఫిక్ పోలీస్ కి తమిళ్ తప్ప ఏమి నచ్చదు, అయిన జేబులో పెట్టుకు తిరుగుతా అంటే నీ ఇష్టం.
రెండు సార్లు లైసెన్స్ అప్లై చేసి మరీ తీసుకొని నా బద్దకాన్ని, పేపర్స్ సరిగ్గా వున్నాయో లేదో కూడా చూడకుండా బండి తీసుకున్న నా అలసత్వాన్ని కసి తీర తిట్టుకున్నా. ఫ్యాషన్ షో నే మొదటి ప్రోగ్రాం అని గుర్తోచి ఇక ఏమి మాట్లాడకుండా బయలుదేరాను.
ఎంటర్ ది డ్రాగన్ అను తమిళ్ చిత్రము (ఇది ప్రతి ఔటింగ్ లో నేను అనుకునే ఫేమస్ డైలాగ్).
హాల్ లో తలుపు తీసి అడుగు పెట్టగానే ఎదురుగ మా ప్రాజెక్ట్ హెడ్ కనపడింది. ఆమెను చూసి ఒక కాల్గేట్ అండ్ ఒక టిక్-టాక్ (ఒక స్మైల్ అండ్ ఒక హాయ్) ఇచ్చి తల తిప్పి చూస్తే దూరంగా ఒక చెయ్యి మనల్ని పిలుస్తూ కనపడింది. తీరిగ్గా వెళ్లి కూర్చుని అప్పుడు డయాస్ ను చూసా అప్పటికే ఫ్యాషన్ షో స్టార్ట్ అయ్యింది.
షో తో పాటు డయాస్ మీద ఏదో పొగ వదిలారు. ఆ పొగలో కనపడిన మొహలని చూడగానే మతిపోయింది. అప్పటికే పొగ దెబ్బకి కళ్ళ వెంట నీళ్లు, మ్యూజిక్ దెబ్బకి చెవుల్లోంచి రక్తం, కసి తో ముక్కులో నుండి బుసలు, కోపం తో పళ్ళు కొరకుతుంటే దవడలు నొప్పి, చివరికి బాధ తో కడుపులో మంట అన్ని కలిసి వచ్చాయి. షో లో డయాస్ మీద ఆఫీసు వాళ్ళే భయంకరమయిన డ్రెస్ లు వేసుకుని ఒక్కొక్కళ్ళు ఒక్కోలా నడుస్తుంటే నేను నా తెలుగు ఫ్రెండ్స్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని , ప్రతీ సారి నరకం అంచులే ఈ సారి గారెంటీ నరకం అని అర్ధం చేసుకున్నాం.
దీని తర్వాత అంత్యాక్షరి అని, ఆడ్ -జాపి(ప్రముఖ ఆడ్ లకి పారడి) అని వరకు వీలయినంత హింసించి లంచ్ కి ౩౦ నిముషాలు మాత్రమే అని అనౌన్స్ చేసారు. లంచ్ ఎక్కడో అని తల తిప్పి చూసేసరికి నా పక్కనే ఒక లైన్ కనపడింది. అక్కడ లంచ్ అనగానే ఇక్కడ కన్ను మూసి తెరిసే లోపు లైన్ తాయారు అవ్వటం కేవలం మా ఆఫీసు లోనే చూడగలరు. ఇక లంచ్ ఎలా వుండి అంటే దానిలో ఒక్కో ఐటెం మీద ఒక్కో బ్లాగ్ రాయొచ్చు కాని తినటానికి ప్లేట్ మాత్రం దొరకలేదు నాకు. హోటల్ వాడు పది నిమిషాలకో పది ప్లేట్స్ తెచ్చి పెట్టటం అవి నిమిషం లో అయిపోవటం. ఇక లాభం లేదులే అని నేను తల ఒకరి ప్లేట్ లో ఒక ఐటెం తిని లంచ్ అయ్యింది అనిపించా. చివరిగా వాటర్ తాగగానే హోటల్ వాడి మీద ఒక అభిప్రాయానికి వచ్చేసా. నేను అసహ్యించుకునే వాటిలో మొదటిది clorine కలిపిన వాటర్ (ఈ మొదటిది అప్పుడప్పుడు మారుతూ వుంటాది ). అది ఒక five star హోటల్ లో అస్సలు వూహించ లేను.
ఇప్పటి దాక ఒక ఎత్తు అయితే భోజనం తరువాత అసలు నరకం మొదలయ్యింది. ప్రేమ పెళ్లి మంచిదా? పెద్దలు కుదిర్చిన పెళ్లి మంచిదా అన్నదాని మీద డిబేట్. అది అయ్యేసరికి పెళ్లి అంటేనే విరక్తి పుట్టేసింది. మా పరిస్థితి చూసిన హోటల్ వాడు మెంటల్ హాస్పిటల్ కి ఎమన్నా ఫోన్ చెయ్యమంటారా సర్ అని మర్యాదగా అడిగాడు. బహుశా వాడు ఆ హోటల్ లో అంత రచ్చ ఎప్పుడు చూసి వుండదు. దాని తర్వాత భయంకరమయిన క్విజ్. అందులో మచ్చుకు కొన్ని ప్రశ్నలు : ఒలంపిక్స్ లో ఈ సంవత్సరం ఇండియా కి ఎన్ని మెడల్స్ వచ్చాయి? చిరంజీవి మొదటి సినిమా ఏంటి? నయనతార అసలు పేరు ఏంటి? భారతదేశం లో రాష్ట్రాలు ఎన్ని?
ఇక నాలోని గాంధీ చచిపోయి, ఇక వల్ల కాదు జంప్ అవుదామని డిసైడ్ అయిన క్షణం లో యాంకర్ (ఎవరో అనుకునేరు ఆమె మా ప్రాజెక్ట్ హెడ్/సింగర్/దాన్సుర్ ఇంకా ఇంకా ...) మరికొద్ది క్షణాల్లో చెన్నై రోకెర్స్ చేత డాన్స్ ప్రోగ్రాం అనగానే సీట్ కి అతుక్కు పోయా. ఎడారి లో ఫ్రిజ్ వాటర్ దొరికినట్లు, అమెజాన్ అడివి లో హేలేకప్టర్ దొరికినట్లు, నెట్ లో హర్రి పోట్టర్ అన్ని బుక్స్ దొరికినట్లు, అతిధి సినిమా లో అమృతారావు వచినట్లు, చిట్టి డ్రెస్ తో ఒకపాప & కో వచ్చి డాన్స్ మొదలెట్టారు. తర్వాత అరగంట సేపు ఈలలు కేకలు తప్పితే ఏమి వినపడలేదు, డయాస్ తప్పితే ఏమి కనపడలేదు. కాని ముప్పైనలుగో నిమిషం లో నా ఫోన్ గోల మొదలెట్టింది. 'ఎంజాయ్ చేసింది చాలు ఆఫీసు కి పో'.
నేను ఎంత దురద్రుస్తావంతుదినో ఆ కాల్ చూడగానే అర్ధం అయ్యింది. నా మూడు సంవత్సరాల చెన్నై జాబు లైఫ్ లో కేవలం రెండు సార్లు సనివారం రోజు ఆఫీసు కి వెళ్లాను. అప్పుడు కూడా ముందు రోజే నిర్ణయించుకుని వెళ్ళాము. కాని ఒక ఫోన్ కాల్ వచ్చి వెళ్ళటం ఇదే మొదటిసారి.