రోజూలానే దరిద్రమయిన అన్నలక్ష్మి భోజనం తిని ఒక కునుకు వేస్తుండగా (నిజమే నేను చాల మంది లానే అన్నం తినగానే ఆఫీసు సీట్లోనే నిద్రపోతాను - ఈ వాక్యంలో ఏమాత్రం తప్పు లేదు) వేరే టీం అతను ఫోన్ చేసాడు. ఏంటో అంత కొమ్పమునిగే పని అని ఫోన్ లిఫ్ట్ చెయ్యగానే 'సత్యం లో అవతార్ ౩-డీ వచ్చింది, వీకెండ్ కి బుక్ చేసుకుందామా' అని అడిగాడు. 'అర్రర్రే ఇప్పుడే చూసా సైట్ పని చేస్తున్నట్లు లేదు, నీకు వర్క్ అవుతుంటే బుక్ చేసేయి' అని పెట్టేసాను. కంగారు పడవద్దు, ఇప్పుడు నేను ఆ సినిమా మీద రివ్యూ రాయటం లేదు. నేను రివ్యూ లు కేవలం టైం పాస్ కోసం చదువుతాను. అందులో కొంతమంది హీరోనో డిరేక్టర్నోవాళ్ళ కసికొద్దీ చీల్చి చండాదేస్తుంటే చదవటానికి భలే కామెడిగ వుంటది. సరే ఇప్పుడు మనకి రివ్యూల మీద రివ్యూ లు అనవసరం అనుకుని నా సిని జీవితం గురుంచి అలా కలకంటూ మల్లి కునుకు వెయ్యటం మొదలెట్టా.
నా సిని జీవితం అంటే నేనేదో సినీ ఫీల్డ్ లో ఈదుతున్న పెద్ద చేప అనుకోవద్దు. కాకపోతే నా చుట్టుపక్కల నా అంత సినిమా పిచోడు వుండదు అని మా అన్న నా రూం లో చేరేదాకా అనుకోలేదు. నాకు సినిమా ఎలా వున్నా పర్వాలేదు కాని చూసే ఎన్విరాన్మెంట్ బాగుండాలి. కాని మా అన్నకి అలంటి పట్టింపు కూడా లేదు. ఆయనకి బుద్ది పుట్టినప్పుడు చూడటానికి ఒక సినిమా వుండాలి అంతే.
నాకు వూహ తెలిసాక చూసిన మొదటి సినిమా 'యుద్దభూమి'. దానిలో చిరంజీవి ని చూసి హీరో అంటే ఇలా వుండాలి అనుకున్నా. కాని ఆ సినిమా లో చనిపోయిన విల్లన్ ని ఇంకో సినిమాలో చూసి దడుసుకున్న. తర్వాత దానినే నటన అంటారు అని తెలుసుకున్న. కొన్నాళ్ళకి 'భైరవ ద్వీపం' చూసి హీరో అంటే బాలకృష్ణే అని డిసైడ్ అయ్యా. కొన్నాళ్ళకి ఇంగ్లీష్ సినిమా ఎరేసర్ చూసి వీళ్ళెవరు హీరో లు కాదు ఆర్నోల్డ్ నే హీరో అనుకున్నా. ఇలాంటి ఇంగ్లీష్ మూవీస్ ఇంకొన్ని చూసి మనకంటే వాళ్ళు కొంచం బాగా తీస్తారు అంతే అని నా హీరో ల లిస్టు లోనుండి అందరిని డిలీట్ చేశా.
నా పదో తరగతి వరకు పండగొచ్చినా, పబ్బమోచ్చినా, చుట్టలోచ్చిన నా మొదటి ఛాయస్ సినిమానే.
ఇంటర్ లో హాస్టల్ గోడదూకి సినిమాలకి వెళ్ళటం మొదలెట్టాక ఇంట్లో వాళ్ళు నాకు సినిమా పిచ్చి కాస్త తగ్గింది అనుకున్నారు, కాని నాకు పిచ్చి ముదిరిందని తెలుసుకోలేక పోయారు.
ఇక డిగ్రీ కి వచ్చాక మనకి అడ్డు లేకపోయింది. అదే కాక డిగ్రీ టైం కి పాకెట్ మనీ పెరిగింది, హాస్టల్ ఖర్చు తగ్గింది, టికెట్ ఖర్చు మరీ తక్కువ అనిపించింది. దానితో డిగ్రీ మొత్తం మూడు పరభాషా చిత్రాలు ఆరు తెలుగు బాషా చిత్రాలుగా గడిచింది. డిగ్రీ టైం లో శని, ఆది వారాలలో జీపులు కట్టుకుని మరీ హాస్టల్ మొత్తం సినిమాలకి వెళ్ళేవాళ్ళం.
జాబు త్రైల్స్ మొదలెట్టిన కాడి నుండి మొత్తం రివర్స్ అవసాగింది. బెంగుళూరు లో కొత్త తెలుగు సినిమా రావటం కరువు బాదితులు ఆహార పొట్లల కోసం కొట్టుకున్నట్లు టికెట్ల కోసం కష్టపడే వాళ్ళం. కర్మ కాలి చెన్నై లో జాబు వచ్చింది. ఇక నా బాధ వర్ణనాతీతం. రాగానే మొదట ఎంక్వయిరీ చేసింది తెలుగు సినిమాలు ఎక్కడ ఆడతాయి అని. అవి కరెక్ట్ గ మేము వుండే ప్లేస్ కి ముప్పై కిలోమీటర్లు దూరం లో వున్న కాసినో ధియేటర్ లో అని తెలిసి తిన్నగా బాత్రూం కి వెళ్లి నాగార్జున లాగా కుమిలి కుమిలి ఏడ్చాను. అయిన పట్టు వదలని విక్రమార్కుడిలా ఆంధ్ర వెళ్ళినప్పుడో, కర్మ కాలి షాపింగ్ వెళ్ళినప్పుడు ఆ కాసినో లోనే సినిమా ప్రోగ్రాం వుండాలిసిందే.
ఎవరు పాపిష్టి కళ్ళు పడ్డాయో కంపెనీ మారాలిసి వచ్చింది. అప్పుడప్పుడే తెలుగు సినిమాలు కొన్ని మల్టీప్లెక్ష్ లలో ఆడటం మొదలెట్టాయి. కంపెనీ వాటి దగ్గరలో వున్న, ఏ షో కూడా చూడలేని షిఫ్ట్ లో పడ్డాను. ఎవడన్న దయతలిచి అర్ధరాత్రి షో వేసినా తిరిగి మా వూరు వెళ్ళటానికి ఆ నెల శాలరీ మొత్తం ఆటో వాడి చేతిలో పెట్టాలి.
కొన్నాళ్ళకి బైక్ తీసుకున్నా. ఇక ధైర్యంగా సెకండ్ షో చూసి వస్తూ అదృష్ట దేవతకి కన్నుకోట్టేసరికి కోపంతో కరెక్ట్ గా మా రూం అర కిలోమీటర్ ఉందనగా పోలీసులకి పట్టించింది. వాడు ఒక్క పేపర్ లేకపోతేనే ముక్కు పిండుతాడు అలాంటిది ఏ ఒక్క పేపర్ లేకుండా, కనీసం లైసెన్సు కూడా లేకపోతే వదులుతాడా??
ఇక లాభం లేదు అని ఎయిర్టెల్ వాడి నెట్ తీసుకుని ఇంగ్లీష్ సినిమాలు డౌన్లోడ్ చేసుకుంటూ, ఆంధ్ర వెళ్ళినప్పుడు తెలుగు సినిమాలు చూసుకోవాలని డిసైడ్ అయ్యా. అలాగే స్వభాషాభిమానం తో తెలుగు సినిమాలు డౌన్లోడ్ చెయ్యకూడని నాకు నేనే తోడ కొట్టుకున్నా. మరి కొన్నాళ్ళకి ధియేటర్ ఆడేవి తప్ప మిగతావి ఏవయిన డౌన్లోడ్ చేసుకోవచు అని మల్లి తోడ కొట్టుకున్నా. మల్లి కొన్నాళ్ళకి మంచి ప్రింట్ అయితేనే డౌన్లోడ్ చేసుకోవాలి అని మల్లి మల్లి తోడకోట్టుకున్నా. ప్రస్తుతానికి తోడ వాచి ఇంకా ఏమి అనుకోదలుచుకోలేదు.
సరే ఇక నెట్ లో కొత్త సినిమాలు వెతుక్కోవలసిన పని వుంది, ఓహ్ మర్చిపోయా ఆఫీసు లో వున్నాకదా ఇక నిద్రలేచి పని చూసుకుంటా.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 కామెంట్‌లు:
చాలా బాగా రాసేరండి, పాపం మీ అవస్తలు తలుచుకున్న కొద్ది నవ్వు వస్తోంది. కష్టాలు ఎక్కువ కాలం వుండవు లెండి, సినిమా ల మీద మోజు తొందర లోనే తగ్గి పోతుంది మీరు వర్రీ కాకండి. ;-)
మొదటిసారి మీ బ్లాగు చూడటం..చాలా బాగా రాసారండి...
కామెంట్‌ను పోస్ట్ చేయండి